వివేకానంద స్వామి గోరక్షకుడితో అప్పుడు మాట్లాడినట్టే  ఈ కాలంలో మాట్లాడితే  ఆయన పరిస్థితి ఎలా ఉండేదో........


ఇది 1897 ఫిబ్రవరిలో కోల్‌కతాలోని బాగ్ బజార్ ప్రాంతంలో జరిగింది. స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస భక్తుడు ప్రియనాథ్ ఇంట్లో కూర్చుని ఉన్నారు. రామకృష్ణ భక్తులు చాలా మంది ఆయనను కలవడానికి అక్కడికి వచ్చారు. అక్కడ రకరకాల అంశాల గురించి మాట్లాడుకుంటున్నారు.


అప్పుడే అక్కడికి గోరక్షణ గురించి ప్రచారం చేసే ఒక వ్యక్తి వచ్చారు. వివేకానందుడు ఆయనతో మాట్లాడారు. వారిద్దరి మధ్య చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది. దీనిని శరత్‌చంద్ర చక్రవర్తి బంగ్లాలో రాశారు.

స్వామీ వివేకానందుడు గోరక్షణ ప్రచారకులతో అప్పట్లో ఏం మాట్లాడి ఉంటారు?


షికాగోలో 1893లో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో హిందూమతం విశిష్టతపై అనర్గళంగా ప్రసంగించి స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకానంద గోరక్షకులతో ఏమని మాట్లాడారో ఊహించడం అంత సులభం కాదు.


వివేకానందుడు-గోరక్షకుడి మధ్య సంభాషణ



ఆ రోజు గోరక్షకుడు కూడా కాషాయ వస్త్రాలే ధరించి ఉన్నారు. ఆయన తలపై కాషాయ తలపాగా కూడా ఉంది. ఆయన బెంగాల్ బయట హిందీ బెల్టుకు చెందినవారు. గోరక్షకుడైన ఆ స్వామీజీ, వివేకానందుడు ఉన్న గది లోపలికి అడుగుపెట్టారు. వివేకానందునికి ఒక గోమాత చిత్రం ఇచ్చారు. తర్వాత వివేకానందుడు ఆయనతో మాట్లాడారు. ఇద్దరి మధ్యా జరిగిన ఆ సంభాషణను 'కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద'లో ఇలా ఉంది.

వివేకానందుడు- మీ సంఘం ఉద్దేశం ఏంటి?


గోరక్షకుడు- మేం దేశంలోని గోమాతలను కసాయిల నుంచి రక్షిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో గోశాలలు ఏర్పాటు చేశాం. కసాయిల నుంచి తప్పించిన వాటిలో జబ్బుపడి, బలహీనంగా ఉన్న ఆవులకు గోశాలల్లో ఆశ్రయం ఇచ్చాం.

వివేకానందుడు - చాలా మంచి విషయం చెప్పారు. మీ సంఘానికి ఆదాయం ఎలా వస్తుంది?


గోరక్షకుడు - మీలాంటి మహాపురుషులు దయతో కొంత ఇస్తారు. వాటితోనే సంఘాన్ని నిర్వహిస్తాం.

వివేకానందుడు - మీ దగ్గర జమ అయిన మొత్తం ఎంత ఉంటుంది?


గోరక్షకుడు - మార్వాడీ వైశ్య సంఘాలు దీనికి చాలా ఆర్థిక సాయం అందిస్తున్నాయి. వారు ఈ సత్కార్యానికి చాలా నిధులు అందించారు.


వివేకానందుడు - మధ్య భారతదేశంలో ప్రస్తుతం భయంకరమైన కరవు ఉంది. తిండి దొరకక 9 లక్షల మంది ఆకలితో చనిపోయారని భారత ప్రభుత్వం చెప్పింది. మీరు ఈ కరవు పరిస్థితుల్లో వారికి ఏదైనా సాయం చేయడానికి ప్రయత్నించారా?

గోరక్షకుడు - మేం కరవులు లాంటి వాటికి సాయం చేయం. ఈ సంఘం కేవలం గోవులను రక్షించాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు.


వివేకానందుడు - కరవుతో మీ కళ్ల ముందే లక్షలాది మంది చనిపోతున్నారు. మీ దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు వారికి ఒక్క మెతుకైనా అందించి, భయంకరమైన కరవు నుంచి వారిని కాపాడడం మీ కర్తవ్యం అనుకోలేదా?

గోరక్షకుడు - లేదు, అది వారి కర్మఫలం. వారు పాపాలు చేయడం వల్లే కరువు వచ్చింది. 'కర్మ ఎలా ఉంటుందో అలాంటి ఫలం లభిస్తుంది'.


గోరక్షకుల సమాధానం విని స్వామి వివేకానందుడి కళ్లు ఆగ్రహంతో మరింత పెద్దవయ్యాయి. చింత నిప్పుల్లా మారాయి. కానీ ఆయన తన భావాలన్నీ లోపలే దాచుకున్నారు. శాంతంగా మాట్లాడారు.

"ఏ సంఘాలు మనుషులపై సానుభూతి చూపించవో, సాటి సోదరుల ఆకలి చావులు చూస్తునే, వారి ప్రాణాలు కాపాడడానికి పిడికెడు మెతుకులు కూడా పెట్టవో, పక్షులు-పశువుల కడుపు నింపడానికి మాత్రం భారీగా ఖర్చు పెడతాయో అలాంటి సంఘాలపై నాకు ఎలాంటి సానుభూతి ఉండదు. అలాంటి సంఘాల వల్ల సమాజానికి పెద్దగా ప్రయోజనం ఉంటుందని నాకు ఎలాంటి నమ్మకం లేదు" అని వివేకానంద అన్నారు.

తర్వాత వివేకానందుడు కర్మఫలం గురించి కూడా మాట్లాడారు.


"మనుషులు తమ కర్మఫలం వల్లే మరణిస్తున్నారు. ఇలా అంతా కర్మఫలం అని ఉండిపోతే, ప్రపంచంలో ఏదైనా పని చేయడానికి ప్రయత్నించడం అనేది పూర్తిగా పనికిరానిదనే నిరూపితం అమవుతుంది. పశుపక్ష్యాదులకు మీరు చేసే సాయం కూడా దీని కిందికే వస్తుంది. దీనిని కూడా కర్మఫలమనే చెప్పచ్చు. గోమాతలు కూడా తమతమ కర్మఫలం వల్లే కసాయిల చేతుల్లోకి చేరుతున్నాయి. ప్రాణాలు కోల్పోతున్నాయి. అందుకే వాటి రక్షణ కోసం ప్రయత్నించడం వ్యర్థం" అన్నారు.


వివేకానందుడి వ్యంగ్యం

వివేకానందుడి నోటి వెంట ఆ మాటలు విన్న గోరక్షకుడి నోట కాసేపు మాట రాలేదు. తర్వాత ఆయన "ఆ, మీరు చెబుతున్నది నిజమే, కానీ శాస్త్రాలు గోవును మన తల్లిగా చెబుతున్నాయిగా" అన్నారు.

ఆయన మాటలు వివేకానందుడికి నవ్వు తెప్పించాయి. ఆయన నవ్వుతూనే "అవును, గోవు మన తల్లి. అది నాకు చాలా బాగా తెలుసు. లేదంటే ఇలాంటి అద్భుతమైన సంతానానికి వేరే ఎవరు జన్మనివ్వగలరు" అన్నారు.


దాంతో గోరక్షకుడు ఏం మాట్లాడలేకపోయారు. ఆయన బహుశా వివేకానందుడి వ్యంగ్యాన్ని అర్థం చేసుకుని ఉండరు. తర్వాత ఆ గోరక్షకుడు వివేకానందుడితో ఈ సంఘం తరఫున మీ దగ్గర ఏదైనా భిక్ష పొందడానికి వచ్చాను అన్నాడు.


దానికి వివేకానందుడు "నేను ఏమీలేని సన్యాసిని, బికారిని. నా దగ్గర మీకు సాయం చేయడానికి చిల్లిగవ్వ కూడా లేదు. కానీ ఇంకో మాట కూడా చెప్పాలి. నా దగ్గర ఎప్పుడైనా డబ్బు ఉన్నా, దానిని మొదట మనుషులకు సేవ చేయడానికే ఖర్చు చేస్తా. మొదట మనిషిని కాపాడాలి. అన్నదానం, విద్యాదానం, జ్ఞానదానం చేయాలి. అవన్నీ చేశాక, డబ్బులేవైనా మిగిలితే అప్పుడు మీ సంఘానికి ఎంతోకొంత ఇవ్వగలను" అన్నారు.


వివేకానందుడి సమాధానంతో గోరక్షకుడు అక్కడినుంచి వెళ్లిపోయారు.


'మానవత్వమే పెద్ద మతం'

అప్పుడు అక్కడే ఉన్న రామకృష్ణ పరమహంస శిష్యుడు శరత్‌చంద్ర తర్వాత ఏం జరిగింది రాశారు. తమతో జరిగిన సంభాషణను వివరించారు.

'గోరక్షకుడు ఏం చెప్పారు, ఏమన్నారు? కర్మఫలం వల్లే మనిషి మరణిస్తున్నాడా? అందుకే వాళ్లపై ఎందుకు దయ చూపించాలి అంటాడా? మన దేశం ఇలా కావడానికి ఇది సజీవ సాక్ష్యం. నీ హిందూ మతం కర్మవాదం ఎటువైపు వెళ్లిపోతోంది? మనిషిగా ఉండి సాటి మనిషి మీద జాలి చూపించని వారు అసలు మనుషులేనా?' అని వివేకానందుడు అన్నారని శరత్ చంద్ర చెప్పారు.


అలా అంటున్నప్పుడు వివేకానందుడి శరీరమంతా బాధతో, దుఃఖంతో కదిలిపోయింది.

ఈ మొత్తం సంభాషణ 122 ఏళ్ల ముందు జరిగింది. కానీ ఈ సంభాషణకు ప్రస్తుత కాలానికి ఏదైనా సంబంధముందా?


ఈ సంభాషణతో వివేకానందుడికి మనిషి, మానవత్వం అనేదే అన్నిటికంటే పెద్ద మతం అని మనకు తెలుస్తుంది. కానీ ఆయన పేరు తలుచుకున్నప్పుడు, వివేకానందుడిలోని ఈ భావన మనలో ఎంతమందికి గుర్తొస్తుంది?

 గోరక్షకుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రక్బర్ ఖాన్

మరింత ఆలోచిస్తే?


మెదడుకు పనిపెడితే, అది మెదడును మరింత చురుగ్గా చేస్తుందని నిపుణులు చెబుతారు. అందుకే మనం ఇప్పుడు ఒక విషయాన్ని ఊహించుకుందాం. ఒకవేళ కాషాయ వస్త్రాలు, తలపాగా ధరించే స్వామి వివేకానందుడే ఇప్పుడు మన మధ్య ఉండుంటే ఇటీవల జరిగిన ఘటనలకు ఏమనేవారు?


ఝార్ఖండ్‌లో సంతోషి, మీనా ముసహర్, సావిత్రి, రాజేంద్ర బిర్హోర్.. ఇక దిల్లీలోని ముగ్గురు చిన్నారులు శిఖ, మానసి, పారుల్ ఆకలితో చనిపోయారు.

ఆవులు దొంగిలించారనే ఆరోపణలతో అఖ్లాఫ్, అలీముద్దీన్, పహ్లూ ఖాన్, కాసిం, రక్బర్ ఖాన్ లాంటి వారిని హత్య చేశారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి హత్యలు, దాడులు లేదా ఇతర హింసను సమర్థించుకునే ప్రయత్నాలు జరిగాయి.

గోశాలల్లో ఆవులు మృతి చెందాయి.


పంట చేతికి రాక అప్పుల్లో మునిగిపోయి వేలాది రైతులు చనిపోయారు.

ఇలాంటి ఘటనలు చూసుంటే వివేకానందుడు ఏం అనేవారో మనం సులభంగా అంచనా వేయచ్చు. అవునా?


అయినా, ఇలాంటి వాటిని ప్రశ్నించడం అక్రమమే అవుతుంది. ఒకవేళ ఈరోజు స్వామి వివేకానందుడు ఉంటే, ఆయన ఎవరైనా గోరక్షకుడితో అప్పుడు మాట్లాడినట్టే మాట్లాడి ఉంటే ఆయనకు ఏమయ్యేది?


Post a Comment